ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి

ఏపి కర్నూలు జిల్లాలోని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (53) కొద్దిసేపటి క్రితం గుండె పోటుతో మరణించారు. ఆయనకు గుండెపోటు వచ్చిన వెంటనే ఆయన కుమార్తె ఎమ్మెల్యే అఖిలప్రియ ఆయనను తక్షణం ఆళ్ళగడ్డలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నంద్యాలలోని సురక్షా ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ  అయన ప్రాణాలను కాపాడలేకపోయారు. 

భూమా, ఆయన కుమార్తె మొదట వైకాపాలో ఉండేవారు. గత ఏడాదే ఇద్దరూ తెదేపాలోకి మారారు. భూమాకు గుండె పోటు వచ్చిన సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియగానే ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ కు ఫోన్ భూమాకు అత్యవసరమైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఆయన గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి హృద్రోగవైద్య నిపుణుల బృందాన్ని నంద్యాలకు పంపించారు. కానీ భూమా పరిస్థితి విషమించడంతో ఎవరూ కాపాడలేకపోయారు.

భూమానాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి 2014 ఎన్నికలలో గెలిచిన తరువాత కొన్ని నెలలకు కారు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి కూడా మరణించడంతో వారి కుమార్తె అఖిల ప్రియ తల్లితండ్రులిద్దరినీ కోల్పోయి ఒంటరి అయిపోయారు.  

భూమా మరణవార్త తెలుసుకొని ఆయన అనుచరులు, తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొంటున్నారు. కొద్ది సేపటి క్రితమే తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా అక్కడికి చేరుకొన్నారు.