నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను: రేవంత్ రెడ్డి

తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శనివారం శాసనసభ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ “నేను మళ్ళీ చెపుతున్నాను. నేను తెరాస సర్కార్ పై చేసిన ఆరోపణలు కట్టుబడి ఉన్నాను. అది చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అన్నిటిలో చాలా బారీగా అవినీతి జరిగింది. కమీషన్ల కోసమే తెరాస సర్కార్ కొన్ని పైపుల కంపనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టింది. గవర్నర్ ప్రసంగం అంతా అబద్దాలతో నిండి ఉందనే నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ 6,100 గ్రామాలకు నీళ్ళు అందిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎన్ని గ్రామాలకు ఇచ్చారో చెప్పగలరా? కనీసం ఆయన సొంతూరు చింతమడకలో గానీ, హరీష్ రావు స్వంత ఊరు తోటపల్లెకు కానీ, నా స్వంత ఊరు కొండారెడ్డి పల్లెకు గానీ నీళ్ళు అందించగలిగిందా? కేసీఆర్ చెప్పాలి. ఈ ఊళ్ళే కాదు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం..నీళ్ళు అందించిన ఒక్క గ్రామాన్ని చూపించగలరా? మరి మిషన్ భగీరథ పెట్టి మీరు ఏమి సాధించారని? మీ అవినీతిని తప్పులను ఎత్తి చూపిస్తున్నాననే కక్షతోనే మమ్మల్ని సభ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారని తెలుసు. ఇన్ని అబద్దాలు చెపుతూనే మళ్ళీ ఒక్క ఆరోపణ నిరూపించినా రాజీనామా చేసేస్తానని చెప్పడం కంటే రాజీనామా చేసి తప్పుకొంటే హుందాగా ఉండేది కదా. నేను తెరాస సర్కార్ మీద చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. అన్నిటినీ నేను నిరూపించగలను. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రావాలి. ఎక్కడైనా ఎప్పుడైనా నేను సిద్దం,” అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.