షర్మిల నిర్ణయం మంచిదే

మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల 16 ఏళ్ళ సుదీర్గ నిరాహార దీక్షను విరమించి, పి.ఆర్.జె.ఏ. అనే పార్టీని స్థాపించి మణిపూర్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమెతో సహా ఆమె పార్టీ సభ్యులు అందరూ చాల ఘోరంగా ఓడిపోయారు. ఆమె మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ చేతిలో చాల ఘోరంగా ఓడిపోయారు. ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే పోల్ అవడం ఆమె చాల షాక్ తిన్నారు. తన ఆశయ సాధన కోసం రాజకీయాలలోకి వచ్చానని కానీ తనకు ప్రజాధారణ లేదని తేలిపోయిందని కనుక రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని ఆమె ప్రకటించారు. తన తదుపరి కార్యాచారణ గురించి ఆలోచించుకొని చెపుతానని అన్నారు.

ఆమె మణిపూర్ లో సాయుధ దళాలకు గల ప్రత్యేక అధికారాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇంత కాలం నిరాహార దీక్ష చేశారు. కానీ ఇంతవరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు తన పోరాటాన్ని పట్టించుకోకపోవడంతో ఇంకా ఎంత కాలం నిరాహారదీక్ష చేసినా ప్రయోజనం ఉండదని భావించి రాజకీయాల ద్వారా తన ఆశయాన్ని సాదిద్దామనుకొని మళ్ళీ భంగపడ్డారు. కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం చాలా మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు. తన పోరాటాన్ని వేరే విధంగా కొనసాగించవచ్చు లేదా తన పోరాటాలకు స్వస్తి చెప్పి వివాహం చేసుకొని హాయిగా కుటుంబ జీవనం సాగించవచ్చు. ఆమె నిరాహార దీక్ష విరమించిన రోజునే తను త్వరలోనే పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నానని చెప్పారు. కనుక అదే చేయవచ్చు. ఒక ధీర వనిత ఈవిధంగా నిష్క్రమించవలసి రావడం చాలా బాధాకరమే.