ప్రతిపక్షాలకు కేసీఆర్ హెచ్చరిక!

ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం శాసనసభలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలకు కొందరు నేతలకు ప్రభుత్వాన్ని విమర్శించడం, ఆరోపణలు చేయడం ఒక దురలవాటుగా మారిపోయింది. మేము ఏమి పనిచేసినా దానిలో ఏదో అవినీతి జరిగిపోతోందని ఆరోపణలు చేస్తుంటారు. నిరూపించమంటే నిరూపించరు. నా ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నట్లు ఎవరైనా నిరూపిస్తే నేను ఐదే ఐదు నిమిషాలలో నా పదవికి రాజీనామా చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను. ప్రజలకు నీళ్ళు అందిద్దామని మిషన్ భగీరథ అని పేరు పెట్టుకొంటే దానికి ‘కమీషన్ భగీరథ’ అంటారు. అలనాడు కాకతీయుల మనకు పెట్టిన బిక్ష చెరువులు. వాటిని పునరుద్దరించడానికి వారి పేరు మీదుగా మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకొంటే దానిని ‘కమీషన్ కాకతీయ’ అని ఆరోపణలు చేస్తుంటారు. ఇలాగ ప్రతీదానికి లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే ఇంకా ఎంత కాలం సహించాలి మేము? అందుకే ఇక నుంచి ఆరోపణలు చేసినవారే వాటిని తప్పనిసరిగా నిరూపించుకోవాలి. లేకుంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. ‘ప్రూవ్ ఆర్ పేరిష్’ తప్పనిసరి. దీని కోసం త్వరలోనే ఒక బిల్లు ప్రవేశపెట్టి చట్టం రూపొందిస్తాము,” అని అన్నారు.