ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో దాదాపు స్పష్టం అయిపోయింది. భాజపా తను అధికారంలో లేని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో తిరుగులేని విజయం సాధించబోతోంది. ఇంతవరకు తను అధికారంలో ఉన్న పంజాబ్ లో ఓడిపోబోతోంది. ఇక తన చేతిలో ఉన్న గోవాలో మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలంటే బయట పార్టీల మద్దతు తప్పనిసరి. మణిపూర్ లో కూడా అదే పరిస్థితి. ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్, భాజపాలు సరిసమానంగా సాగుతున్నాయి. వాటిలో ఏది తెలివిగా, చురుకుగా పావులు కదిపితే దానికే ఆ రాష్ట్రాలు చేజిక్కుతాయి.
కాంగ్రెస్ పార్టీకి యూపిలో మళ్ళీ మరోసారి పరాభవం ఎదురైంది. గత 27 ఏళ్ళుగా అక్కడ ప్రతిపక్ష బెంచీలకే పరిమితం అయింది. ఇప్పుడు దానికి మరో ఐదేళ్ళు కలుపుకొంటే 32 ఏళ్ళు అవుతాయి. ఇది కాంగ్రెస్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డు. ఆ ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుంది.
ఇక పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొని ఆమాద్మీని మట్టి కరిపించడం గొప్ప విషయమే. ఆ క్రెడిట్ మాత్రం రాహుల్ గాంధీకు దక్కదు. గత పదేళ్ళుగా పంజాబ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన అకాలీదళ్-భాజపా కూటమి పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ పార్టీకి విజయం సాధ్యం అయింది. దానికి మూల కారకుడు అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయనే పంజాబ్ దుస్థితిని ప్రజల కళ్ళకు కట్టినట్లు వివరించారు. కానీ తన ఆమాద్మీని గెలిపించుకోలేకపోయినా కాంగ్రెస్ ను గెలిపించారు. కనుక పంజాబ్ లో కాంగ్రెస్ విజయానికి క్రెడిట్ అరవింద్ కేజ్రీవాల్ కు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అధికారం కాంగ్రెస్ కు అప్పజెప్పిన అకాలీదళ్-భాజపా కూటమికే చెందాలి.