జడ్జి అరెస్టుకు వారంట్ జారీ!

కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సి.ఎస్.కర్ణన్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన ఉత్తర్వులను స్వయంగా ఆయన చేతికి అందించి, ఈ నెల 31లోగా ఆయనను తమ ముందు ప్రవేశపెట్టవలసిందిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డిజిపిని సుప్రీంకోర్టు ఆదేశించింది.   

ఈ గొడవకు మూలకారణం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి భార్య వేసిన పిటిషన్. జస్టిస్ కర్ణన్ తన భర్తను, తనను చాలా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్. ఖేర్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముంచు విచారణకు హాజరు కావలసిందిగా సుప్రీంకోర్టు కర్ణన్ ను ఆదేశించింది. కానీ ఆయన తన కేసుని విచారించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని, కనుక తనను విచారణకు హాజరు కమ్మని ఆదేశించడం రాజ్యాంగ విరుద్దమే అవుతుందని లేఖ వ్రాశారు. తన కేసును పరిశీలించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది కనుక దానిని పార్లమెంటుకు పంపివలసిందిగా సుప్రీంకోర్టుకు సూచించారు. 

ఆయన విచిత్ర ప్రవర్తనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, ఆయన చాలా భాద్యాతాయుతమైన పదవిలో ఉన్నందున ఆయనకు మరొక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మార్చి 10న అంటే ఈరోజు జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ ఈరోజు కూడా ఆయన హాజరుకాకపోవడంతో ఆయనను అరెస్టు చేసి సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డిజిపిని ఆదేశిస్తూ నేడు కన్నన్ పేరిట ఒక అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒకవేళ ఆయన బెయిల్ పొందదలిస్తే రూ.10,000 విలువగల వ్యక్తిగత పూచికత్తు సమర్పించవలసి ఉంటుందని సూచించింది. 

సుప్రీంకోర్టు తనకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై జస్టిస్ కర్ణన్ ఘాటుగా స్పందిస్తూ, “సుప్రీంకోర్టుకు నన్ను విచారించే, అరెస్ట్ చేసే హక్కులేదు. నేను దళితుడను గాబట్టే అందరూ కలిసి నన్ను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను దీనిని గట్టిగానే ఎదుర్కొంటాను,” అని అన్నారు.