నేటి నుంచి తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన బిఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రులు హరీష్రావు, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు జానారెడ్డి, చిన్నారెడ్డి, తెదేపా తరపున సండ్ర వెంకట వీరయ్య, భాజపా తరపున కిషన్ రెడ్డి, మజ్లీస్ అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.
దానిలో బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేశారు. నేటి నుంచి మొత్తం 14 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అంటే ఈనెల 27వ తేదీ వరకు సమావేశాలు సాగుతాయి. మద్యలో 12,14,19,26 తేదీలలో శలవుదినాలుంటాయి. గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ శుక్రవారం ఉంటుంది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మార్చి 13న బడ్జెట్ ప్రవేశపెడతారు. 15, 16,17 తేదీలలో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. బడ్జెట్ లోని వివిధ అంశాలపై సభ్యుల ప్రశ్నలకు మార్చి 17న ప్రభుత్వం సమాధానాలు చెపుతుంది. మార్చి 25న ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది.