ఫిర్ సే జంగ్ షురూ!

నేటి నుంచి తెలంగాణా రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశ్యించి గవర్నర్ నరసింహన్  ప్రసంగిస్తున్న సమయంలోనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గవర్నర్ చేత తెలంగాణా ప్రభుత్వం అన్నీ అబ్బదాలే చెప్పించిందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తూ అందుకు నిరసనగా సభ నుంచి వాక్ అవుట్ చేశారు. 

పిసిసి ప్రెసిడెంట్ ఉత్తం కుమార్ రెడ్డి మీడియా పాయింట్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేకపోయినా గతంలో మా ప్రభుత్వం చేసినవన్నీ తానే చేసినట్లు గొప్పలు చెప్పుకొంటోంది. మూడేళ్ళలో ఇంతవరకు ఒక విద్యుత్ ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు. సొంతంగా ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకువచ్చి నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటోంది. అనేక పరిశ్రమలు వచ్చయి. గొప్ప వృద్ధి రేటు సాధించాము. రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతోంది అంటూ గవర్నర్ నరసింహన్  చేత అన్నీ అబద్దాలే చెప్పించారు. గవర్నర్ ప్రసంగంలో ఒక్క ముక్క కూడా నిజం లేదు. తెరాస సర్కార్ దానితో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించింది. అందుకే మేము నిరసనగా వాక్ అవుట్ చేశాము,” అని చెప్పారు.  

తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శాసనసభలో మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ, “గవర్నర్ కాళ్ళకు కేసీఆర్ మొక్కుతుంటారు కనుక కావాలంటే ఆయనను ఆశీర్వదించుకోవచ్చు. కానీ అవినీతిలో మునిగి తేలుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం తగదు. అవినీతి ఆరోపణల కారణంగానే గతంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించిన సంగతి గవర్నరుకు తెలియదా? అసలు గవర్నర్ ప్రసంగాన్ని మంత్రివర్గం చేత ఎందుకు ఆమోదింపజేయలేదు. అది ఆనవాయితీకి విరుద్దం కాదా? గవర్నర్ వ్యవస్థను అవమానించినట్లు కాదా? తెరాస ప్రభుత్వ అవినీతి గురించి ఎంత చెప్పుకొన్నా సరిపోదు. అటువంటి ప్రభుత్వం చాలా అద్భుతంగా, చాలా పారదర్శకంగా పనిచేస్తోందని గవర్నర్ నరసింహన్  చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది,” అని ఎద్దేవా చేశారు. 

శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు సభలో మాట్లాడుతూ, “గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు ఆయనకు ఆటంకం కలిగించకూడదని, సభలో నినాదాలు చేయకూడదని బిఏసి సమావేశంలో అందరూ అంగీకరించారు.  కానీ సభలో ప్రతిపక్షాలు అందుకు విరుద్దం వ్యవహరించడం చాలా దురదృష్టకరం. వారు లేవనెత్తుతున్న సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెపుతున్నప్పటికీ, ఏవో కుంటిసాకులు చూపి సభ నుంచి వాక్ అవుట్ చేయడం వాటికి చిత్తశుద్ధి లేదని స్పష్టం చేస్తోంది,” అని అన్నారు. సభ మొదటి రోజు నుంచే అధికార, ప్రతిపక్షాల మద్య ఇంత తీవ్ర స్థాయిలో యుద్దాలు ప్రారంభమయిపోతే ఇక మున్ముందు సమావేశాలు ఏవిధంగా సాగుతాయో..ఏమో?