మహిళలంటే కేసీఆర్ కు చిన్న చూపేల?

మార్చి 8న మహిళాదినోత్సవాన్ని తెరాస సర్కార్ చాలా ఘనంగానే నిర్వహించినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నేటికీ ప్రతిపక్షాల విమర్శలు ఆగడం లేదు. ఆయనకు మహిళలు అంటే చాలా చిన్న చూపని అందుకే తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవాకాశం కల్పించలేదని విమర్శిస్తున్నాయి. వేరే మహిళలకు మంత్రి పదవి ఇస్తే, తన కుమార్తె కవిత ప్రాధాన్యత తగ్గిపోతుందనే భయంతోనే ఎవరికీ మంత్రిపదవి ఇవ్వలేదని కాంగ్రెస్ విమర్శించింది. 

తెరాసలో పద్మా దేవేందర్ రెడ్డి (మెదక్), కొండా సురేఖ (వరంగల్ తూర్పు), కె లక్ష్మి (అసిఫాబాద్) రేఖా నాయక్ (ఖానాపూర్), గొంగిడి సునీత (ఆలేర్), బోడిగె శోభ (చొప్పదండి) శాసనసభ్యులుగా ఉన్నారు. 

ఇంతమంది సమర్ధులైన మహిళలు పార్టీలో ఉండగా ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళు పూర్తవుతున్న వారిలో ఏ ఒక్కరికీ ఇంతవరకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని భాజపా అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ ప్రశ్నించారు. అంటే వారిలో ఎవరూ మంత్రి పదవులు చేపట్టడానికి అర్హులు కారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడుతున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రంలో మహిళలకు మంత్రివర్గంలో ప్రాతినిద్యమే లేకుండాపోయిందని ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. 

అదే తమ భాజపా ప్రభుత్వాలలో మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రులు (రాజస్తాన్), కేంద్రమంత్రులు (నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ), లోక్ సభ స్పీకర్ (సుమిత్ర మహాజన్), చివరికి ప్రతిపక్షనేతల వంటి కీలకపదవులలో ఉన్నారని, వారు యావత్ మహిళాలోకానికే గర్వకారణంగా నిలుస్తున్నారని కృష్ణ సాగర్ అన్నారు. మరి కేసీఆర్ వీరి విమర్శలకు ఏమి జవాబు చెపుతారో చూడాలి.