గురువారంనాడు జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాద్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బ్యాలెట్ పేపర్ లో పొరపాటును ఒక అభ్యర్ధి స్థానంలో మరొక అభ్యర్ధి ఫోటోలు అచ్చు వేయబడ్డాయి. ఈవిషయం అభ్యర్ధులు, ఓటర్లు పోలింగ్ మొదలైన వెంటనే ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్ లాల్ దృష్టికి తీసుకువెళ్ళి పోలింగ్ నిలిపివేయాలని కోరారు. కానీ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువెళ్ళి దాని నుంచి ఆదేశాలు వచ్చే వరకు పోలింగ్ కొనసాగించాలని నిర్ణయించడంతో పోలింగ్ జరుగుతున్నంత సేపు కూడా అభ్యర్ధులు, ఓటర్లు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. చివరకి ఆ ఎన్నికలను రద్దు చేయమని నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల కమీషన్ నుంచి ఆదేశాలు రావడంతో బ్యాలెట్ పేపర్లో ఆ తప్పును సవరించి మళ్ళీ ఈనెల 19న రీపోలింగ్ నిర్వహిస్తామని భన్వర్ లాల్ ప్రకటించారు. బ్యాలెట్ పేపర్లో ఈవిధంగా అభ్యర్ధుల ఫోటోలు తారుమారు అవడం ఇదే ప్రధమం అని అందుకు చింతిస్తున్నామని అన్నారు. దీనిపై విచారణ జరిపి భాద్యులపై కటిన చర్యలు తీసుకొంటామని భన్వర్ లాల్ చెప్పారు.
నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న పాపన్నగారి మాణిక్ రెడ్డి, ఆది లక్ష్మయ్యల ఫోటోలు బ్యాలెట్ పేపర్ లో తారుమారు అయ్యాయి. ఒకరి పేరు పక్కన మరొకటి ఫోటో ముద్రించబడింది. ఎన్నికల సంఘం తన తప్పును అంగీకరించి దానిని సరిదిద్దుకొంటూ మళ్ళీ రీపోలింగ్ కు అంగీకరించింది కనుక అందరూ శాంతించారు.