నేటి నుంచి ప్రారంభం అయిన పార్లమెంటు రెండవ విడత బడ్జెట్ సమావేశాలలో అమెరికాలో ప్రవాసభారతీయులపై జరుగుతున్న దాడులపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అక్కడ అమెరికాలో ప్రవాసభారతీయులు భయందోళనలతో జీవిస్తుంటే, మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపి మల్లికార్జున ఖర్గే విమర్శించారు. విదేశాంగ మంత్రి కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. అలాగే ట్రంప్ ప్రభుత్వం హెచ్1-బి వీసాలపై విదిస్తున్న ఆంక్షల వలన ప్రవాసభారతీయులు, అమెరికాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న భారతీయ సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనుక మోడీ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టవలసిందిగా కోరారు.
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖర్గేకు సమాధానమిస్తూ, అమెరికాలో ప్రవాసభారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని, ఈ సమస్యపై తమ ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంటులో ఒక నిర్దిష్టమైన ప్రకటన చేస్తుందని చెప్పారు. అమెరికాలో ప్రవాసభారతీయులపై దాడులు జరుగడం చాలా దురదృష్టకరమని అందుకు తాను కూడా బాధ పడుతున్నాని మంత్రి అన్నారు.