నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఒక అపురూపమైన సంఘటన జరిగింది. ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషాకు చాలా అరుదైన గౌరవం లభించింది. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డి. కృష్ణ భాస్కర్ స్వయంగా ఆమెను తన కుర్చీలో కూర్చోబెట్టి నిన్న ఒక్కరోజు జిల్లా కలెక్టరుగా వ్యవహరించే అవకాశం కల్పించారు. ఆమె తన కుర్చీలో కూర్చొని విధులు నిర్వహిస్తుంటే అయన అధికారుల కోసం కేటాయించబడిన కుర్చీలో కూర్చొని ఆమెను గౌరవించారు. యాస్మిన్ బాషా నిన్న రోజంతా కలెక్టర్ హోదాలోనే అధికారులతో వివిధ అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వాటిలో పాల్గొన్న అధికారులు అందరూ కూడా ఆమెను కలెక్టరు గారు అని సంభోదిస్తూ గౌరవించారు. అయితే కలెక్టర్ హోదాలో విధులు నిర్వహించినప్పటికీ, జాయింట్ కలెక్టరుగా వ్యవహరిస్తున్న కారణంగా చట్టప్రకారం ఫైళ్ళపై సంతకాలు చేయకూడదు కనుక చేయలేదు. ఇదొక అపూర్వమైన గౌరవం..విశేషమే కదా.