రైలు ప్రేలుళ్ళపై హైదరాబాద్ నుంచే నిఘా

మొన్న భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో జరిగిన ప్రేలుళ్ళ గురించి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసులను హెచ్చరించింది ఎవరంటే తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన హైదరాబాద్ లోని కౌంటర్ ఇంటలిజన్స్ సెల్. ఈ ప్రేలుళ్ళకు పాల్పడిన  ఇస్లామిక్ స్టేట్ కొరసాన్ అనే ఉగ్రవాద సంస్థ సభ్యుల ఫోన్ కాల్స్, మెసేజ్ లు, ఈ మెయిల్స్ వగైరాలపై     గత ఆరు నెలలుగా ఈ సి.ఐ.సెల్ నిఘా పెట్టింది. వారు సిరియా లేదా ఇరాక్ లోని ఒక ఉగ్రవాద సంస్థ నేతతో నేరుగా మాట్లాడుతున్నట్లు కనుగొన్నారు. అతని ఆదేశాల మేరకే కేరళతో సహా దేశంలో కొన్ని రాష్ట్రాలలో తమ సంస్థ కోసం యువతను రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు కనుగొన్నారు. అయితే ప్యాసింజర్ రైలులో ప్రేలుళ్ళకు పాల్పడినవారు అటువంటి ఆలోచన ఏదీ చేస్తున్నట్లు కనబడకపోవడంతో వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేయలేదని, కానీ ప్రేలుడు జరిగిన మరుక్షణమే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీస్ డిజిపిలకు సమాచారం అందించడంతో, వారు వెంటనే స్పందించి ఈ ప్రేలుళ్ళకు పాల్పడిన, కుట్ర పన్నినవారిని అందరినీ అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సి.ఐ.సెల్ నిఘా విభాగంలో ఒక ఉన్నతాధికారి చెప్పారు. 

ఈ ప్రేలుళ్ళకు సూత్రధారులలో ఒకరైన మొహమ్మద్ సైఫుల్లాను లక్నోలో పోలీసులు నిన్న మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. కాన్పూర్ లో ఒక వ్యక్తిని, మధ్యప్రదేశ్ లో పిపారియా అనే ప్రాంతంలో అతిఫ్ ముజాఫర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఎన్కౌంటర్ మరియు అరెస్టులన్నీ తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన హైదరాబాద్ సి.ఐ.సెల్ నిఘా అందించిన సమాచారం ఆధారంగానే జరిగాయని సదరు అధికారి చెప్పారు.

ప్రాధమిక దర్యాప్తులో తేలిన విషయం ఏమిటంటే మొన్న దీపావళి టపాసులలో నుంచి పొటాషియం క్లోరైట్ అనే ప్రేలుడు పదార్ధాన్ని తీసి దానితో తయారుచేసిన బాంబునే ప్యాసింజర్ రైలులో అమర్చి పేల్చినట్లు తెలుస్తోంది. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ ఉగ్రవాద బృందానికి సరిపడినంత డబ్బు లేకపోవడంతో వారు తమ స్వంత డబ్బుతోనే ఈవిధంగా  బాంబును తయారుచేసి ప్రేలుళ్ళకు పాల్పడ్డారు. అది అంత ప్రమాదకరమైనది కాకపోవడం చేతనే ప్రాణనష్టం జరుగలేదు. కానీ మొదటి ప్రయత్నంలో ఈ కుట్రకు పాల్పడిన వారందరూ గంటల వ్యవధిలోనే పట్టుబడిపోయారు. దీనిని బట్టి అర్ధమవుతున్నదేమిటంటే అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు కూడా ఈవిధంగా కౌంటర్ ఇంటలిజన్స్ విభాగాలు ఏర్పాటు చేసుకొని సమన్వయంతో పనిచేయవలసి ఉందని.