బాబు కలలకి నేవీ బ్రేకులు

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చాలా పెద్ద పెద్ద కలలే కంటుంటారు. ఒక్కోసారి అవి ఎవరి ఊహలకు అందని స్థాయిలో ఉంటాయి. ఇండియన్ నేవీ సర్వీసుల నుంచి తొలగించబడుతున్న విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విరాట్ ను తీసుకొని దానిని విశాఖ సాగరతీరంలో నిలిపి దానిపై ఒక పెద్ద హోటల్ ఏర్పాటు చేయాలని బాబు కలలుగన్నారు.

ఇదివరకు ఇండియన్ నేవీ నుంచి కురుసుర సబ్ మెరైన్ తీసుకొని దానిని బీచ్ ఒడ్డున ప్రతిష్టింపజేసి అందరి మన్ననలు అందుకొన్నారు. సామాన్య ప్రజలు ఎవరూ కూడా నిజమైన సబ్ మెరైన్ లోకి వెళ్ళి చూడలేరు. కానీ అది సాధ్యం చేసి చూపారు. యావత్ దేశంలో మరెక్కడా ఈవిధంగా సబ్ మెరైన్ రోడ్డు పక్కన పార్క్ చేసి కనబడదు. కనుక దానిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. కనుక బీచ్ ఒడ్డున ఏర్పాటు చేసిన ఆ సబ్ మెరైన్ విశాఖ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అదే విధంగా ఇప్పుడు ఈ అతిబారీ విమాన వాహక యుద్ద నౌకను కూడా విశాఖ తీరంలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు కలలుగన్నారు. దాని కోసం సుమారు 750 ఎకరాలలో పెద్ద పార్క్ కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకొన్నారు. రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ ను, ఇండియన్ నేవీ అధికారులను కూడా ఒప్పించారు కానీ దాని కోసం ఏకంగా రూ.1000 కోట్లు చెల్లించవలసి ఉంటుందని రక్షణ శాఖ తెలుపడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు.

దానిని తీసుకోవడానికి ఏపి సర్కార్ వెనుకంజవేయడంతో ఐ.ఎన్.ఎస్.విరాట్ ను సముద్రగర్భంలో మ్యూజియంగా మార్చేందుకు ఇండియన్ నేవీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ అది కూడా చాలా భారీ ఖర్చుతో కూడుకొన్నదే కావడంతో ఇక విధిలేని పరిస్థితులలో దానిని ఇనుప తుక్కుగా అమ్మివేయాలని సేందుకు ఆలోచిస్తోంది.