రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రతీ సోమవారం చేనేత వస్త్రాలు ధరించి, చేనేత రంగానికి చేయూతనీయాలని ఐటి మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపుకు ఉద్యోగులు ఏ మేరకు స్పందించారో తెలియదు కానీ హైదరాబాద్ లోని అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ ఉద్యోగులు మాత్రం చాలా చక్కగా స్పందించారు. కౌన్సిలేట్ జనరల్ కేథరిన్ బి హడ్డ ప్రోత్సాహంతో కౌన్సిలేట్ ఉద్యోగులు అందరూ ప్రతీ సోమవారం చేనేత వస్త్రాలు ధరించడం మొదలుపెట్టారు. అంతే కాదు..మొన్న చేనేత దినం సందర్భంగా కౌన్సిలేట్ ప్రాంగణంలోనే అభిహార హ్యాండ్ లూమ్ దుఖాణం ఏర్పాటుకు అనుమతించారు. చేనేతను ప్రోత్సహిస్తున్న మహిళా ఎంటర్ ప్రీనర్ ‘అభిహారా హ్యాండ్ లూమ్’ వ్యవస్థాపకురాలు సుధా ముళ్ళపూడిని కూడా కౌన్సిలేట్ కు ఆహ్వానించి ఆమెతో కలిసి ఉద్యోగులు అందరూ ఒక ఫోటో దిగారు. దానిని “మేము అందరం ఇంత అందమైన రంగురంగుల చేనేత వస్త్రాలను ధరించినప్పుడు,” అనే క్యాప్షన్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కౌన్సిలేట్ జనరల్ కేథరిన్. దానికి వెంటనే స్పందించిన మంత్రి కేటిఆర్ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.