మహిళలకు కవితక్క సందేశం

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ఎంపి కవిత మహిళలకు చక్కటి సందేశం ఇచ్చారు. “ఇటీవల అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటులో వివిధ దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. వారు చెప్పిన దానిని బట్టి ఆ దేశాలలో కూడా మహిళల పరిస్థితి మన దేశానికి భిన్నంగా లేదు. మహిళల సమస్యల పట్ల సమాజం ఏవిధంగా స్పందిస్తుందనేదే వారి పరిస్థితికి కొలమానంగా ఉంటోంది. మన దేశంలో నిర్భయ సంఘటన జరిగినప్పుడే అమెరికాలో కూడా అటువంటిదే జరిగింది. ఇక్కడ మన మీడియా దానికి చాలా హైప్ సృష్టించింది. కానీ అక్కడ మీడియా దాని గురించి పెద్దగా వ్రాయలేదు. అన్ని చోట్ల మహిళల సమస్యలు ఒకేలాగున్నా వాటిపై సమాజం స్పందించే తీరులోనే తేడా ఉందని ఇది స్పష్టం చేస్తోంది. 

మనం ఏదో మొక్కుబడిగా మహిళా దినోత్సవాలు చేసుకోవడం కాకుండా మహిళలకు అన్ని రంగాలలో సముచిత ప్రాధాన్యత ఈయలి. ఆ స్థానాన్ని దక్కించుకొనేందుకు మహిళలు కూడా గట్టిగా కృషి చేయాలి. అందుకు షార్ట్ కట్ మార్గాలు లేవు. క్రమశిక్షణ, హార్డ్ వర్క్, లోకజ్ఞానం, సరైన ప్లానింగ్, ఎంచుకొన్న రంగంలో నైపుణ్యాభివృద్ధి చేసుకోవడం, ఆరోగ్యం కాపాడుకోవడం వంటివి అలవాటు చేసుకొని పాటించడం మొదలుపెడితే ఏ రంగంలో నైనా మహిళలు అభివృద్ధి సాధించగలరు. మహిళలు పైకి ఎదిగిన తరువాత సాటి మహిళలకు చేయూత నిచ్చి వారు కూడా పైకి ఎదిగేందుకు సహాయపడాలి. చాలా మంది మహిళలు కుటుంబం కోసం తమ వృత్తి నైపుణ్యాన్ని,అభిరుచులను, అలవాట్లను, చిన్న చిన్నకోర్కెలను వదులుకొంటారు. ఒకపక్క కుటుంబాన్ని నిర్వహిస్తూనే, మహిళలు తాము ఎంచుకొన్న రంగాలలో అభివృద్ధి సాధించినవారు ఎందరో ఉన్నారు. కనుక మహిళలు కూడా తమకు అభిరుచి గల రంగంలో ప్రవేశించేందుకు తమ ముందు ఉన్న ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి,” అని కవిత అన్నారు.