డిల్లీ యూనివర్సిటీలో రాం లాల్ ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ జిఎన్.సాయిబాబా మావోలతో కలిసి దేశవిద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని రుజువు అవ్వడంతో మహారాష్ట్రాలోని గడ్చిరోలి న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విదిస్తూ నిన్న తీర్పునివ్వడం చాలా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఆయన శరీరంలో 90 శాతం పనిచేయదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి సైతం ఎవరో ఒకరి మీద ఆధారపడతారు. ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలున్నాయి. వీల్ చైర్ కే పరిమితం. ఆ స్థితిలో ఉన్న ఆయన మావోయిష్టుల కోసం పనిచేయగలరా? అంటే ‘చేయగలరు..చేస్తున్నారు కూడా’ అని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ పీ.సత్యనాథన్ వాదించారు.
ఇదే ఆరోపణలపై ఆయనతో సహా మరి కొందరిని మే 2014 లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ జైలులో ఆయన ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారిపొతుండటంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మానవతా దృక్పధంతో కోర్టు బెయిల్ మంజూరు చేస్తే ఆయన దానిని దుర్వినియోగపరుస్తూ మళ్ళీ మావోయిష్టుల కోసం పని చేయడం మొదలుపెట్టారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.
నేటికీ ఆయన నిషేధిత సంస్థలో సభ్యుడుగా కొనసాగుతున్నారని, మావోల రిక్రూట్ మెంటుకు సహకరిస్తున్నారని, దేశ విదేశాలలో జరుగుతున్న సదస్సులకు హాజరవుతున్నారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఆయన మావోలకు అనుకూలంగా పనిచేసే ఒక అనుబంద సంఘాన్ని కూడా స్థాపించి, నడిపిస్తున్నారని వాదించారు. అందుకు సంబంధించిన ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియాలో వచ్చిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు.
అయన శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాట వాస్తవమే కానీ ఈ సంఘ విద్రోహ చర్యలన్నీ మానసికంగా అనారోగ్యంగా లేరని నిరూపిస్తున్నాయనే అయన వాదనతో ఏకీభవించిన గడ్చిరోలి న్యాయస్థానం ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు విదించింది.
ఆయనతో బాటు జె.ఎన్.యు విద్యార్థి హేమ్ మిశ్రా, పాత్రికేయుడు ప్రశాంత్ రాహి, మహేశ్ టిర్కే, పాండు నరోత్ లకు అవే అభియోగాలపై సెక్షన్స్: 13, 18, 20, 38, 39 క్రింద యావజ్జీవ ఖైదు విధించింది. మావోలకు కొరియర్ గా పనిచేస్తున్నట్లు రుజువైన విజయ్ టిర్కే అనే వ్యక్తికి 10 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించింది.
ఈ తీర్పును నాగపూర్ లోని హైకోర్టు బెంచిలో సవాలు చేస్తామని ప్రొఫెసర్ సాయిబాబా చెప్పారు. మావోల సానుభూతిపరుడు వరవరరావు కూడా న్యాయస్థానం తీర్పును తప్పు పట్టారు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి అటువంటి శిక్ష విధించడాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు.
ఈ కేసుపై వరవరరావు స్పందించడమే ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిష్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు ఒక నిదర్శనం. కుర్చీలో నుంచి కదలలేని స్థితిలో ఉన్నా కూడా ప్రొఫెసర్ సాయిబాబా మావోల కోసం పనిచేస్తుండటం నిజమైతే, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్ధించవలసిందే.