నేడే చివరి దశ పోలింగ్

ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నేడు చిట్ట చివరి దశ పోలింగ్ కొద్ది సేపటి క్రితం మొదలైంది. అన్ని పార్టీలకు చాలా కీలకమైన యూపిలో నేడు 40 స్థానాలకు మొత్తం 528 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారిలో 115 మంది నేర చరితులు కాగా 132 మంది కోటీశ్వరులు ఉన్నట్లుఅసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అధ్యయనం చేసి ప్రకటించింది. వారిలో కాంగ్రెస్, భాజపా, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలకు చెందినవారు కూడా ఉన్నారు. వారిలో నుంచే యూపి ప్రజలు తమ ప్రతినిధులను నేడు ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఈరోజు ఎన్నికలు జరుగుతున్న 40 నియోజకవర్గాలలో మొత్తం 1.41 కోట్లు మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళా ఓటర్లు 64.76 లక్షలున్నారు. వారి కోసం మొత్తం 14,458 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. 

ఇక మణిపూర్ లో 22 నియోజకవర్గాలలో చివరి దశ పోలింగ్ కొద్ది సేపటి క్రితమే మొదలైంది. ఈ 22 స్థానాలకు మొత్తం 98మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ రోజు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలలో మొత్తం 7,79,369 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 3,93,091 మంది మహిళా ఓటర్లున్నారు. వారి కోసం మొత్తం 1,151పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. 

నేటితో 5రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసినప్పటికీ, కొన్ని చోట్ల రేపు రీపోలింగ్ జరుపబడుతుంది. కనుక రేపు సాయంత్రం వరకు ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియాలో ముందస్తు ఫలితాలపై ఎటువంటి కధనాలు, విశ్లేషణలు ప్రసారం చేయకూడదని ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.