మోడీ ప్యాకేజీలు ప్రకటనలకే పరిమితమా?

అక్టోబర్ 2015లో జరిగిన బిహార్ శాసనసభ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్లు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, మౌలిక వసతుల అభివృద్ధి కోసం అదనంగా మరో రూ.40,000 కోట్లు మంజూరు చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. 

ముంబై కి చెందిన అనిల్ గల్ గలి అనేవ్యక్తి “దానిలో ఇంతవరకు ఎంత సొమ్ము మంజూరు చేశారు? మిగిలింది ఇంకా ఎప్పుడు మంజూరు చేస్తారు?” అని సమాచార హక్కు చట్టం క్రింద కేంద్ర ఆర్ధిక శాఖను అడుగగా అది చెప్పిన సమాధానం విని అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే దానిలో ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఇంతవరకు ఒక్క పైసా చెల్లించలేదు కనుక ఇక ముందు కూడా చెల్లించే ఉద్దేశ్యం లేదనే భావించవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ బిహార్ ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో భాజపాను గెలిపించి అధికారంలోకి తీసుకురావడం కొరకే ఆ హామీ ఇచ్చినట్లు అర్ధం అవుతోంది. కానీ భాజపా అధికారంలోకి రాలేకపోయింది కనుక ఆ హామీని పక్కనపడేసినట్లు భావించవలసి ఉంటుంది. 

అంతకు ముందు 2014 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ దానిని ఆయన నిలబెట్టుకోలేదు. దానికి బదులు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చామన్నారు కానీ దానిలో కూడా కొత్తగా అదనంగా ఏమీ ఇవ్వలేదు.

నవంబర్ 2015లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా ఎవరూ అడగకుండా రూ.80,068 కోట్లు ప్రత్యేక ప్యాకేజి ఇస్తానని హామీ ఇచ్చారు. దానినీ విడుదల చేయలేదు

ఇప్పుడు ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అదే విధంగా బారీగా వరాలు ప్రకటిస్తున్నారు. కానీ ఒకవేళ అక్కడ భాజపా ఓడిపోయినట్లయితే, ఆ వరాల మూటలు గంగానదిలో కనబడకుండా కొట్టుకుపోవడం ఖాయం అని అనిల్ గల్ గలి అభిప్రాయం వ్యక్తం చేశారు. అది నిజమేనని చెప్పవచ్చు.