హమ్మయ్య లోకేష్ ఎమ్మెల్సీ అయిపోయాడు..

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధికార పార్టీల తరపున ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేషన్లు వేసిన వారు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణాలో తెరాస తరపున నామినేషన్ వేసిన మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అదేవిధంగా ఆంధ్రాలో తెదేపా తరపున నామినేషన్లు వేసిన నారా లోకేష్, కరణం బలరాం, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, వైకాపా తరపున ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.వారందరినీ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ప్రకటించినప్పుడే వారికి ఆ పదవులు ఖాయం అయిపోయాయని చెప్పవచ్చు.

వారందరిలో మొట్ట మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన నారా లోకేష్ పైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే అతను ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కుమారుడు. ఆయన రాజకీయ వారసుడు కనుక. ఇంతవరకు ఆయన పనితీరు గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇకనుంచి అనుక్షణం ప్రజలు, ప్రతిపక్షాల దృష్టిలో ఉంటారు కనుక తన సత్తా నిరూపించుకొని ప్రజల అంచనాలను అందుకోవలసి ఉంటుంది. ఈ ఉగాది పండుగలోగానే నారా లోకేష్ మంత్రి పదవి చేపట్టడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి.