ఈరోజు ఉదయం మద్యప్రదేశ్ రాష్ట్రంలో షాజాపూర్ జిల్లాలోని కాలా పీపల్ అనే ప్రాంతం సమీపంలో భోపాల్-ఉజ్జయినీ పాసింజర్ రైలులో జరిగిన ప్రేలుళ్ళు ఉగ్రవాదుల పనే అని మధ్యప్రదేశ్ పోలీస్ డిజిపి దృవీకరించారు. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రేలుడులో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
నిఘా వర్గాలు అందించిన సమాచారంతో ఆ ప్రేలుళ్ళకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఇద్దరిలో ఒకరిని ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో పోలీసులు సజీవంగా పట్టుకోగలిగారు. సైఫుల్ అనే మరొక అనుమానితుడు లక్నోలో హాజీ కాలనీలోని ఒక ఇంటిలో దాగి ఉన్నట్లు గుర్తించిన యాంటీ టెర్రరిస్ట్ దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టగానే లోపల ఉన్న సైఫుల్ వారిపై కాల్పులు జరుపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. ఎదురు కాల్పులలో అతను మరణించాడు. అతనిని సజీవంగా పట్టుకొని ఈ కుట్రకు సంబంధించి వివరాలు రాబడుదామని ప్రయత్నించామని కాని కుదరలేదని ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీస్ అధికారి తెలిపారు. ఏమైనప్పటికీ ఈ ప్రేలుళ్ళు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అనుమానితులను కనిపెట్టి పట్టుకోగలగడం గొప్ప విషయమే.