ఆంధ్రప్రదేశ్ మనవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాస రావుకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఆయనకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖలోని ఇండియన్ బ్యాంక్ వద్ద నుంచి కొన్నేళ్ళ క్రితం రూ.141.68 కోట్లు రుణం తీసుకొంది. దాని కోసం ఆ సంస్థ ప్రభుత్వానికి చెందిన భూములను తనవిగా పేర్కొంటూ బ్యాంకుకు తాకట్టు పెట్టింది. సామాన్య ప్రజలు ఒక లక్ష రూపాయలు రుణం అడిగితే వారు తాకట్టు పెట్టే బంగారు ఆభరణాలను గీకి గీకి పరీక్షించుకొనే బ్యాంకులు, మంత్రిగారు ప్రభుత్వ భూములను తాకట్టు పెడుతున్నారనే సంగతి గ్రహించలేదంటే నమ్మశక్యంగా లేదు.
ఆ సంస్థ బకాయిలు తీర్చకపోవడం అది తాకట్టు పెట్టిన ఆస్తుల జప్తుకు ప్రయత్నించినప్పుడు బహుశః ఈ విషయం బయటపడినట్లుంది. దీనిపై దాఖలైన ఒక పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించి మంత్రి గారికి నోటీసు జారీ చేసింది. మూడు వారాలలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి గంటా శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. బహుశః అందుకే ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా చర్యలు తీసుకొంటారో లేదో చూడాలి.