ముంజేతి కంకణం చూసుకోవడానికి అద్దం అవసరం లేనట్లే భారత్ లో అప్పుడప్పుడు జరుగుతున్న తీవ్రవాద దాడులన్నీ పాక్ ప్రేరేపితమైనవేనని యావత్ ప్రపంచానికి తెలుసు. మాజీ పాక్ జాతీయ భద్రతా సలహాదారు మేజర్ జనరల్ ముమూద్ అలీ దుర్రానిసోమవారం డిల్లీలో జరిగిన ఒక సదస్సులో చెప్పిన మాటలు భారత్ ఆరోపణలను దృవీకరించాయి.
“ముంబై 26/11 దాడులకు మూలాలు పాకిస్తాన్ లోనే ఉన్నాయి. అది ఖచ్చితంగా సీమాంతర ఉగ్రవాదమే. వాటికి కుట్ర పన్నిన హఫీజ్ సయీద్ తప్పనిసరిగా శిక్షించబడవలసిందే. ఆ దాడులలో చాలా ప్రాణ నష్టం జరిగిది. అది నాకు చాలా బాధ కలిగించింది. నేను తక్షణమే అప్పటి భారత జాతీయ భద్రతా సలహాదారు నారాయాణన్ కి ఫోన్ చేసి మాట్లాడాను.
హఫీజ్ సయీద్ పాక్ గడ్డ పై నుంచే ఈ కుట్రలు పన్నినప్పటికీ అతనితో గానీ ఆ కుట్రలతో గానీ పాక్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదు. అలాగే పాక్ గూడచారి సంస్థ ఐఎస్.ఐ.లో పనిచేస్తున్న ఏ అధికారికి కూడా ముంబైలో జరుగబోయే దాడుల గురించి ముందుగా తెలియదు. నిజానికి హఫీజ్ సయీద్ వలన పాకిస్తాన్ కు ఎప్పుడూ సమస్యలే తప్ప ఉపయోగమేమీ లేదు. మా పాక్ ప్రభుత్వం సుమారు 10 ఏళ్ళు ఊగిసలాట తరువాత అతనిపై, అతని సంస్థలపై చర్యలు తీసుకొనే ధైర్యం చేసింది,” అని చెప్పారు.
దుర్రాని చెప్పిన మాటలలో సగమే నిజమని అందరికీ తెలుసు. ముంబై దాడులకు ముందు పాక్ ఉగ్రవాదులకు పాక్, మిలటరీ, ఐ.ఎస్.ఐ అధికారులే స్వయంగా తగిన శిక్షణ ఇచ్చారని సజీవంగా పట్టుబడి తరువాత ఉరి తీయబడిన పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ చెప్పాడు. ముంబైపై దాడులకు పాక్ గడ్డపై నుంచే కుట్రలు జరిగాయని ధైర్యంగా ఒప్పుకొన్నందుకైనా సంతోషించాల్సిందే. అయితే ఆ విధంగా ఒప్పుకొన్నందుకే అప్పుడు ఆయన ఉద్యోగం ఊడింది. అది వేరే సంగతి.