ఏపి సిఎం చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ చిత్తూరు నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వెలగపూడిలో కొత్తగా నిర్మించిన ఏపి అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ కార్యదర్శికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నారా లోకేష్ తో బాటు ఆయన మావగారు, హిందూపురం తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తెదేపా ఏపి అధ్యక్షుడు కళా వెంకటరావు ఇంకా అనేకమంది తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. లోకేష్ నామినేషన్ ను ఏపి డిప్యూటీ సి.ఎం. కెఈ కృష్ణమూర్తి, కొందరు ఎమ్మెల్యేలు బలపరిచారు.
ఎమ్మెల్యే కోటాలో తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా బచ్చుల అర్జునుడు, కారణం బలరాం, పి సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా ఈరోజే నామినేషన్ వేయబోతున్నారు.
శాసనసభలో అనుచితంగా ప్రవర్తించినందుకు ఏడాదిపాటు సస్పెన్షన్ కు గురయిన వైకాపా ఎమ్మెల్యే రోజాను ఈరోజు శాసనసభ సమావేశాలలో పాల్గొనేందుకు స్పీకర్ అనుమతించడంతో ఆమె కూడా హాజరయ్యారు. జగన్ తో సహా వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొట్టమొదటిసారిగా ఏపి అసెంబ్లీలో నేడు అడుగుపెట్టారు. ప్రస్తుతం ఉభయసభలను ఉద్దేశ్యించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం కొనసాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈరోజు ఓటుకు నోటు కేసుని విచారించిన సుప్రీంకోర్టు కొద్ది సేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.