బడ్జెట్ తరువాత బదిలీలు

తెలంగాణాలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ దృష్ట్యా గత మూడేళ్ళుగా ప్రభుత్వోద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విదించింది. కొత్త జిల్లాలు ఏర్పాడి అప్పుడే 5 నెలలు గడిచిపోయాయి కనుక బడ్జెట్ సమావేశాల తరువాత అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి బదిలీల ప్రక్రియ మొదలుపెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేరు. కనుక సాధారణ పరిపాలన శాఖ అధికారులు బదిలీల కోసం మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఇదివరకు 10 జిల్లాలు ఉండగా ఇప్పుడు అవి 31కు చేరుకొన్నాయి కనుక అన్ని జిల్లాలకు సమానంగా ఉద్యోగులను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. కనుక అందుకు అనుగుణంగానే బదిలీలు జరిగే అవకాశాలున్నాయి. మొదట ఉద్యోగ సంఘాలతో అధికారులు చర్చించిన తరువాత వారి సూచనలు, సలహాలు ప్రకారం మార్గదర్శకాలు రూపొందిస్తారు. తద్వారా బదిలీల ప్రక్రియలో ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు, అభ్యంతరాలు లేకుండా సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఉద్యోగులైన భార్యభర్తలకు, ఏడాదిలోపు పదవీ విరమణ చేయబోతున్నవారికి, దివ్యంగులకు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి మినహాయింపులు ఉంటాయి.