నయీం కేసులో తెరాస నేత విచారణ

ఎన్కౌంటర్ లో మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీంపై అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వాటిలో భువనగిరికి చెందిన గంపా నాగేందర్ అనే వ్యాపారి చేసిన పిర్యాదు కూడా ఒకటి. నయీం తనను రెండు కోట్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నప్పుడు, తాను శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్ ను ఆశ్రయించగా ఆయన నయీంకు ఎంతో కొంత చెల్లించి రాజీ చేసుకోమని చెప్పినట్లు గంపా నాగేందర్ తన పిర్యాదులో పేర్కొన్నారు.

ఆ కేసుపై ఏర్పాటు చేయబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు ఆదివారం నేతి విద్యాసాగర్ ను ప్రశ్నించారు. నల్గొండ, భువనగిరి ప్రాంతాలలో నయీం చేసిన భూకొనుగోళ్ళు, దౌర్జన్యాలలో ఆయనకు కూడా సంబంధం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అయితే నయీంతో తనకు పరిచయం మాత్రమే ఉందని అతనితో ఎటువంటి లావాదేవీలు జరుపలేదని నేతి విద్యాసాగర్ రావు సిట్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.

నయీంతో చాలా మంది పోలీస్ ఉన్నతాధికారులకు, అన్ని పార్టీలకు చెందిన చాల మంది నేతలకు బలమైన సంబంధాలు ఉన్నాయనే సంగతి బయటపడినప్పటికీ, ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం గమనిస్తే, నయీం కేసులు కూడా అన్నీ అటక ఎక్కించేసినట్లే కనిపిస్తోంది. నయీంతో సంబంధాలున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చిన తరువాత కూడా నేతి విద్యాసాగర్ రావు తన పదవికి రాజీనామా చేయలేదు. తెరాస సర్కార్ ఆయనను పదవిలో నుంచి తొలగించలేదు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అటువంటి గౌరవప్రదమైన పదవిలో కొనసాగడం ఎంతవరకు సమజసమో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి.