నేటి నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో కొత్తగా నిర్మించుకొన్న శాసనసభ భవనంలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జరుగుతున్న సమావేశాలివి. కీలకమైన బడ్జెట్ సమావేశాలతో ఇవి మొదలవుతుండటం విశేషం. 

ఆనవాయితీ ప్రకారం గవర్నర్ నరసింహన్ ఉదయం 11.06 గంటలకు ఉభయసభలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన అధికార, ప్రతిపక్ష ప్రతినిధులతో జరిగే బిజినెస్ అడ్వైజరీ సమావేశంలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాల అజెండా, షెడ్యూల్ ను ఖరారు చేస్తారు. 

ఈ సమావేశాలలో తెదేపా నేతలకు చెందిన ‘దివాకర్ ట్రావెల్స్’ బస్సు ప్రమాదం, తదనంతర పరిణామాలపై అధికార, ప్రతిపక్షాల మద్య వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశాలకు వైకాపా ఎమ్మెల్యే రోజాను అనుమతిస్తారా లేదో మరికొద్ది సేపటిలో తేలిపోతుంది. కనుక ఈరోజు మళ్ళీ అసెంబ్లీ ముందు రోజా హడావుడి ఉండవచ్చు. ఒకవేళ అనుమతించకపోతే మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆమె హెచ్చరిస్తున్నారు. అలాగే గత సమావేశాలలో స్పీకర్ తో అనుచితంగా వ్యవహరించినందుకు వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల కమిటీ సిఫార్సు చేసింది. ఒకవేళ వారిపై సస్పెన్షన్ వేటు వేస్తే, సభలో మళ్ళీ వైకాపా ఆందోళన చేయడం తద్యం. కనుక ఈసారి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ఏపి శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. మార్చి 13న రాష్ట్ర ఆర్ధిక, వ్యవసాయ బడ్జెట్ లను ప్రవేశపెట్టబడుతుంది.