తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 10వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. మార్చి 13న ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. రెండు వారాలపాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని ఈటెల చెప్పారు. ఈసారి కూడా బడ్జెట్ లో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.
మిగులు బడ్జెట్ తో అందుకొన్న తెలంగాణా రాష్ట్రాన్ని తెరాస సర్కార్ అప్పులపాలు చేస్తోందనే కాంగ్రెస్ పార్టీ విమర్శలకు ధీటుగా జవాబిస్తూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గనుక బారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతునందునే వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకోవలసి వస్తోందని, అంత మాత్రాన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నామని ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదని ఈటెల అన్నారు. తెలంగాణా మాత్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు రుణాలు తీసుకొంటాయని, అదేమీ ఈరోజు తెరాస సర్కార్ కొత్తగా మొదలుపెట్టిన పనేమీ కాదని అన్నారు. తెరాస సర్కార్ తీసుకొంటున్న రుణాలలో ఒక్క పైసా కూడా వృధా చేయకుండా అంతా రాష్ట్రాభివృద్ధికే ఖర్చు చేస్తోందని ఈటెల అన్నారు. కాంగ్రెస్ హయంలో అభివృద్ధి చేయలేకపోయినప్పటికీ, ఆ పని తెరాస సర్కార్ చేస్తుంటే అడ్డుపడుతోందని మంత్రి ఈటెల విమర్శించారు. మిషన్ భగీరద, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో కూడా యధాప్రకారం సముచితమైన నిధుల కేటాయింపు ఉంటుందని ఈటెల చెప్పారు.