మణిపూర్ లో రికార్డుస్థాయిలో పోలింగ్

మణిపూర్ రాష్ట్ర శాసనసభకు ఈరోజు మొదటి దశ పోలింగ్ జరిగింది. ఎప్పుడూ అనిశ్చిత వాతావరణం నెలకొని ఉండే ఆ రాష్ట్రంలో ఈసారి ఏకంగా 84 శాతం మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొనడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. భాజపాకు ఓటేస్తే మణిపూర్ లో పరిస్థితులను పూర్తి చక్కదిద్దుతానని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీపై నమ్మకంతోనే తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో కూడా అంతమంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. మణిపూర్ (మొత్తం 60 నియోజకవర్గాలు) చాలా చిన్న రాష్ట్రమే అయినప్పటికీ చాలా సమస్యాత్మక రాష్ట్రం గనుకనే రెండు దశలలో పోలింగ్ నిర్వహించబడుతోంది. ఈరోజు మొత్తం 38స్థానాలకు పోలింగ్ జరిగింది. 

ఇక ఉత్తరప్రదేశ్ లో నేడు జరిగిన 6వ దశలో సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 57.03 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఈరోజు మొత్తం 40 స్థానాలకు పోలింగ్ జరిగింది. వాటికి ఏకంగా 635 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. మళ్ళీ మార్చి 8న మణిపూర్, ఉత్తరప్రదేశ్ చివరి దశ పోలింగ్ జరుగుతుంది. మార్చి 11న ఫలితాలు వెలువడుతాయి.