తెదేపాలో కిరీటం ధరించని యువరాజు నారా లోకేష్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. కనుక గెలుపు లాంచన ప్రాయమే. ఎమ్మెల్సీ కావడం ఎంత ఖాయమో మంత్రి కావడం అంతే ఖాయమని చెప్పవచ్చు. అసలు లోకేష్ ను మంత్రివర్గంలో చేర్చుకోవడం కోసమే సురక్షితమైన పెరటి మార్గం ద్వారా ప్రభుత్వంలోకి తీసుకువస్తున్నారని అందరికీ తెలుసు.
లోకేష్ మంత్రి పదవి చేపట్టడం ఖాయమే కానీ ఆయనకు ఏ పదవి ఇస్తారనే దానిపై తెదేపాలో అందరూ ఇప్పుడు గుసగుసలాడుకొంటున్నారు. లోకేష్ మొదటి నుంచి ట్వీటర్ యోధుడుగా పేరు సంపాదించుకొన్నారు కనుక ఐటి శాఖను పుచ్చుకొనే అవకాశం కనబడుతోంది. అదే జరిగితే ప్రస్తుతం ఆ శాఖను నిర్వహిస్తున్న పల్లె రఘునాధ రెడ్డికి పదవీ గండం లేదా స్థానభ్రంశం తప్పదు. రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు లోకేష్ అప్పుడపుడు విదేశాలకు వెళ్ళి ప్రముఖులతో ఫోటోలు తీయించుకొని వచ్చారు కనుక పరిశ్రమల శాఖను పుచ్చుకొన్నా ఆశ్చర్యం లేదు.
రాష్ట్రంలో లోకేష్ సమాంతర రాజ్యాంగ శక్తిగా వ్యవహరిస్తూ అధికారులకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తున్నారనే వైకాపా నేతల ఆరోపణలు నిజమనుకొంటే, లోకేష్ కు సాధారణ పరిపాలన లేదా కీలకమైన రెవెన్యూ శాఖలను అప్పగించవచ్చు. ఒకవేళ లోకేష్ రెవెన్యూ పుచ్చుకోదలిస్తే ఆ శాఖను నిర్వహిస్తున్న కేఈ కృష్ణమూర్తికి గండం ఉన్నట్లే లెక్క. తెదేపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచే తనకు ప్రాధాన్యత ఈయనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అప్పుడప్పుడు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనుక లోకేష్ కోసం ఆయనను పక్కకు తప్పించిన ఆశ్చర్యం లేదు.
లోకేష్ ను తన పదవికి, పార్టీకి వారసుడిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు కనుక పరిపాలనపై పట్టు సాధించేందుకు వీలుగా ఉండే మచి కీలకమైన పదవినే అప్పజెప్పడం ఖాయం అని చెప్పవచ్చు. కానీ ఎనికి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్లు లోకేష్ కోసం ఎవరు త్యాగం చేయవలసి వస్తుందో చూడాలి.