తెలంగాణా రాష్ట్రం ఏర్పడినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భద్రకాళి అమ్మవారికి, తిరుపతి వెంకన్న, పద్మావతి అమ్మవారికి, కురివి వీరభద్రుడుకి బంగారు ఆభరణాలు చేయించి మొక్కులు తీర్చుకొన్నారు. ఇంకా బెజవాడ దుర్గమ్మకు ముక్కు పుడక సమర్పించుకోవలసి ఉంది. ఆయన ఈ మొక్కులన్నీ తన స్వంత డబ్బుతో తీర్చుకొని ఉండి ఉంటే ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండేది కాదు. కానీ దేవాలయాలలో ధూపదీపనైవేద్యాలకు, శిధిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్దరణకు వినియోగించవలసిన కామన్ గుడ్ ఫండ్ (సిజిఎఫ్) నిధులతో కేసీఆర్ మొక్కులు చెల్లించుకొన్నందుకు విమర్శలు, ఇప్పుడు కోర్టు కేసులు కూడా తప్పడం లేదు.
ఆ మొక్కులు చెల్లింపు కోసం తెలంగాణా ప్రభుత్వం ఫిబ్రవరి 2015లో జారీ చేసిన జీవో: 22/23 చెల్లదని, అది సిజిఎఫ్ నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్దమని పేర్కొంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, జి.రాము అనే ఒక సామాజిక కార్యకర్త హైకోర్టులో ఒక ప్రజహిత వాజ్యాన్ని దాఖలు చేశారు. దానిపై వచ్చే నెల 6వ తేదీన విచారణ జరుగవచ్చు. మరి తెలంగాణా ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుందో చూడాలి.