మళ్ళీ నోట్ల కష్టాలు

నోట్ల రద్దు తరువాత సుమారు మూడు నెలలపాటు దేశ ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. క్రమంగా పరిస్థితులు సామాన్యస్థితికి చేరుకొంటున్న ఈ సమయంలో మళ్ళీ ఊహించని విధంగా నోట్ల కష్టాలు మొదలయ్యాయి. ఏ ఎటిఎంకు వెళ్ళినా ‘నో క్యాష్ బోర్డు’లే దర్శనమిస్తున్నాయి. కొన్ని బ్యాంకులయితే ఎటిఎంలను మూసివేశాయి కూడా. ఎటిఎంలలో నగదు రాకపోవడంతో ప్రజలు తమ పనులు మానుకొని మళ్ళీ బ్యాంకులకు పరుగులు తీస్తే అక్కడ కూడా పెద్దపెద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. నెల మొదటివారంలో ఈ పరిస్థితి ఏర్పడటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు బ్యాంకులో పడ్డ తమ జీతాలు తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పోనీ.. ప్రైవేట్ బ్యాంక్ ఎటిఎంలలో నుంచి డబ్బు తీసుకొందామా..అంటే అవి అడ్డుగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. 

మార్చి 13వ తేదీ నుంచి నగదు ఉపసంహరణపై అన్ని ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తామని కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ రెండు వారాల క్రితమే ప్రకటించారు. కానీ ఇప్పుడు కనీసం రూ. 10,000 కూడా ఇవ్వలేక బ్యాంకులు ఎటిఎంలను మూసుకొంటున్నాయి.

మళ్ళీ హటాత్తుగా ఈ నోట్ల కొరత ఎందుకు ఏర్పడింది? అంటే బ్యాంకులలో నగదు డిపాజిట్ చేసే వారి సంఖ్య చాలా తగ్గిపోయిందని సమాధానం వినిపిస్తోంది. నగదు లావాదేవీలపై, నగదు నిలువలపై కేంద్రప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగానే బ్యాంకులలో నగదు డిపాజిట్లు తగ్గాయని అనధికార సమాచారం. అయితే పరిమితులున్నప్పుడు నగదు అంతా బ్యాంకులలోనే ఉండాలి కానీ బయటే ఎందుకు ఉండిపోతోంది? అనే సామాన్య ప్రజల ప్రశ్నకు ఆర్ధిక నిపుణులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 

ఏమైనప్పటికీ కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ముందే మేల్కొని ఈ సమస్య ఇంకా పెద్దది కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే మళ్ళీ మూడు నెలల క్రితం నాటి సంక్షోభ పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయ్యే ప్రమాదం ఉంటుంది.