టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ పై మళ్ళీ విమర్శలు గుప్పించారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఇస్లామిక్ స్టడీ సెంటర్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, “పిట్టల రవీందర్ తదితరులు నాపై చేసిన ఆరోపణలపై స్టీరింగ్ కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకొంటాము. నిరుద్యోగ ర్యాలీకి వచ్చిన స్పందన చూసిన తరువాత తెరాస సర్కార్ కు భయం మొదలైన్నట్లుంది. అందుకే మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మాపై ఎదురుదాడులు చేస్తోంది. మేము ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతున్నందున టిజెఎసిని చీల్చి నామరూపాలు లేకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. కానీ తెరాస సర్కార్ కోరుకొంటున్నట్లుగా టిజెఎసి ఎన్నటికీ విడిపోదు. మేము కలిసే ఉంటాము. మా గొంతు వినబడకుండా చేయడానికి టిజెఎసి నేతలపై, మాకు మద్దతు ఇస్తున్న వారిపై, మా ఉద్యమాలలో పాల్గొంటున్న విద్యార్ధులు, ప్రజా సంఘాల నేతలపై తెరాస సర్కార్ కేసులు, అరెస్టులతో భయబ్రాంతులను చేయాలని చూస్తోంది. ఇది చాలా విచారకరం. కానీ మేము ఇటువంటి బెదిరింపులకు, ఒత్తిళ్ళకు భయపడబోము. ప్రజా సమస్యల పరిష్కారం టిజెఎసి ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
ముస్లింల సంక్షేమం కోసం సుధీర్ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి మాట్లాడుతూ,”రాష్ట్రంలో మైనార్టీల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో సుధీర్ కమిటీ నివేదిక కళ్ళకు కట్టినట్లు చూపించింది. వాటిలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన అమలు కూడా ఒకటి. దాని అమలు కోసం టిజెఎసి ఏ స్థాయి పోరాటమైన చేయడానికి సిద్దంగా ఉంది. దానిలో పేర్కొన్న 12 అంశాలలో ముస్లింలకు రిజర్వేషన్ అంశం కాకుండా మిగిలిన సిఫార్సులను ఇంతవరకు ఎందుకు అమలుచేయలేదని తెరాస సర్కార్ ను ప్రశ్నిస్తున్నాము.