బాబు ఆవేదన...తెరాస ఆగ్రహం

వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనం ప్రారంభోత్సవ సందర్భంగా రాష్ట్ర విభజన గురించి ఏపి సి.ఎం.చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెరాస నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రబాబు ఏమ్మన్నారంటే, రాష్ట్ర విభజన జరగడం నాకు చాల బాధ, ఆవేదన కలిగించింది. ఒకపక్క మనకు జరిగిన అన్యాయం..మరోపక్క తీరని అవమానం నా మనసును దహించివేసింది. అప్పుడు నా మనసును ఎవరో పిండివేస్తున్న భావన కలిగింది. నేటికీ అది తలుచుకొంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ బాధను, అవమానాలను, అన్యాయాన్ని అన్నిటినీ దిగమింగుకొని మళ్ళీ పునాది స్థాయి  నుంచి రాష్ట్ర నిర్మాణం మొదలుపెట్టాను. ఏడాది వ్యవధిలోనే ఇక్కడ మనం తాత్కాలిక సచివాలయం, శాసనసభ నిర్మించుకొన్నాము. భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్: 1 స్థానంలో నిలిచే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాను. అదే ఇప్పుడు ప్రధాన నా ధ్యేయం,” అని అన్నారు. 

ఆయన వ్యాఖ్యలపై తెరాస ఎంపి కవిత తీవ్రంగా స్పందిస్తూ, “ చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒక రాజకీయకుట్ర చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు తన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి కుట్ర పన్నారు. రాష్ట్రం విడిపోయినా ఇంకా తన పార్టీ నేతల ద్వారా తెలంగాణా అభివృద్ధికి అడ్డుపడుతూనే ఉన్నారు. తెలంగాణా ప్రజలందరూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకొంటే, ఆయన మాటలు ప్రజలను అవమానపరిచినట్లున్నాయి. అందుకు ఆయన తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలి. చంద్రబాబు తన మనసులో ఇంత విషం పెట్టుకొని వ్యవహరిస్తునందున మన రాష్ట్రంలో తెదేపాకు చోటు లేదు. తెలంగాణాలో తెదేపాను మూసివేయడం మంచిది,” అని కవిత అన్నారు. 

మంత్రి ఈటెల మాట్లాడుతూ, “ఆనాడు తెదేపాతో సహా అన్ని పార్టీలు అంగీకరించిన తరువాతనే రాష్ట్ర విభజన జరిగిందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చంద్రబాబు మొసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అయన ఈవిధంగా మాట్లాడుతున్నారు,” అని అన్నారు.