తెరాస ఎంపి బాల్క సుమన్ తనలో మానవీయకోణాన్ని చాటుకొంటూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులకు స్వయంగా సపర్యలు చేయడమే కాకుండా వారిని ఆసుపత్రికి తరలించి ఖర్చుల నిమిత్తం వారికి కొంత డబ్బు కూడా ఇవ్వడం విశేషం.
ఈరోజు ఉదయం పెద్దపల్లి మండలంలోని పెద్దకాల్వల సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానిని మరొకటి డ్డీ కొనడంతో వాటిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు క్రిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో తన కారులో కరీంనగర్ వెళుతున్న ఎంపి బాల్క సుమన్ వెంటనే కారుని ఆపి, తన కారులో ఉన్న అత్యవసర మెడికల్ కిట్ తో వారి గాయాలకు స్వయంగా కట్లు కట్టారు. తరువాత 108 అంబులెన్స్ సర్వీస్ కు ఫోన్ చేసి రప్పించి దానిలో వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిద్దరికీ వైద్య ఖర్చుల నిమిత్తం కొంత డబ్బు కూడా ఇచ్చి మరీ పంపారు. వారిరువురిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన తరువాత బాల్క సుమన్ మళ్ళీ కరీంనగర్ బయలుదేరారు.
ఒక ఎంపి అయినప్పటికీ ఆయన అంత నిరాడంబరంగా, ఔదార్యంగా ప్రవర్తించడం చూసి అక్కడి ప్రజలు చాలా మెచ్చుకొన్నారు. ఉద్యమ సమయంలో తమలో ఒకడిగా ఉంటూ పోరాటాలు చేసిన బాల్క సుమన్ ఎంపి అయినప్పటికీ అహంకారం నెత్తికి ఎక్కించుకోకుండా సామాన్య ప్రజల పట్ల ఇంత గౌరవంగా, మానవత్వంతో వ్యవహరించడం చూసి వారు మురిసిపోయారు. బాల్క సుమన్ ఆవేశపరుడని మాత్రమే అందరూ అనుకొంటారు. కానీ ఆయనలో ఒక మానవతావాది కూడా ఉన్నాడని చాటుకొన్నారు. అందుకు ఆయనను అభినందించడం ధర్మం. శభాస్ సుమనన్న!