వరంగల్ వాసులకు శుభవార్త!

వరంగల్ వాసులకు శుభవార్త. వరంగల్ లో పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలనే వారి చిరకాల డిమాండ్ త్వరలో నెరవేరబోతోంది. అక్కడ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ నిజామాబాద్ ఎంపి కవిత వ్రాసిన లేఖకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వరంగల్ లో పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని కవితకు తెలియజేశారు. అందుకు కవిత ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. 

వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాలకు చెందిన చాలా మంది గల్ఫ్, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ తదితర దేశాలకు ఉద్యోగాల కోసం వెళుతుంటారు. విదేశాలకు వెళ్ళేందుకు పాస్ పోర్ట్ దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా హైదరాబాద్ వెళ్ళవలసివస్తోంది. అది ఒక్క గంటలోనో ఒక్క రోజులోనో పూర్తయ్యే పని కాదు కనుక హైదరాబాద్ లో తమ పని పూర్తయ్యేవరకు లాడ్జీలలోనో లేదా బంధుమిత్రుల ఇళ్ళలోనో ఉండవలసి వస్తోంది. ఇప్పుడు వరంగల్ లోనే పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటవబోతోంది కనుక సులువుగా పాస్ పోర్ట్ పొందవచ్చు.