ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మించబడిన రాష్ట్ర శాసనసభ భవనాన్ని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆ భవనంలో శాసనసభ, మండలి సమావేశ మందిరాలను, అధికార, ప్రతిపక్ష పార్టీలకు కేటాయించిన ఛాంబర్లను, పరిసర ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా అధ్యక్షుడు జగన్, అతని పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాలేదు. వారు కూడా వచ్చి ఉండి ఉంటె బాగుండేదని స్పీకర్ అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,” శాసనసభలో అందరూ తమ తమ అభిప్రాయాలూ వ్యక్తం చేయవచ్చు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు చేయవచ్చు. తప్పులుంటే ఎత్తి చూపవచ్చు. కానీ సభలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించరాదు. మనం చేస్తున్నది సరైనదేనని ప్రజలకు నమ్మకం కలిగినట్లయితే వారే ఆదరిస్తారు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.