ఐసిస్ సంస్థ వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్ బాగ్దాదీ చేసిన ఒక తాజా ప్రకటన చాలా సంచలనం సృష్టిస్తోంది. బగ్దాదీ వీడ్కోలు ప్రసంగం పేరిట చేసిన ఆ తాజా ప్రకటనలో “ఇరాక్ లోని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) పూర్తిగా ఓడిపోయింది. కనుక ఇప్పుడు అరబ్ లు కాని సభ్యులు అందరూ తక్షణమే తమ తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళిపోవాలి లేదా తమను తాము పేల్చేసుకొని ఆత్మాహుతి చేసుకోవాలి. ఆత్మాహుతి చేసుకొన్నవారికి ఒక్కొకరికీ స్వర్గంలో 72మంది మహిళలు కానుకగా లభిస్తారు,” అని ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇరాక్, అమెరికా సంయుక్త దళాల సేనలు ఇరాక్ లోని ఐసిస్ ఉగ్రవాదులు తిష్ట వేసిన మోసుల్ నగరాన్ని చుట్టుముట్టి వారిని ఏరివేస్తున్నారు. ఇప్పటికే దానిలో చాలా భాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోగాలిగారు. ఈ పరిస్థితులలో ఇక ఐసిస్ ఉగ్రవాదులకు అక్కడ ఉండే అవకాశం కనబడకపోవడంతో అబూ బకర్ తీవ్ర నిరాశ నిస్పృహలతో ఈ వీడ్కోలు ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అబూ బకర్ అల్ బాగ్దాదీని మట్టుబెట్టడానికి అమెరికా సంకీర్ణ సేనలు గత రెండేళ్ళుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇంతవరకు అతను పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రకటన అతనిదే అయితే అతను ఇంకా సజీవంగా ఉన్నాడని స్పష్టం అవుతోంది. ఒకవేళ ఇది నిజంగా అతను చేసిన ప్రకటనే అయ్యుంటే చాలా సంతోషించవలసిన విషయమే. దీని వలన ప్రపంచ దేశాలకి కొంతకాలం పాటు ఐసిస్ ఉగ్రవాదుల బెడద తగ్గవచ్చు.