యూపి ఎన్నికల ప్రచారానికి కిషన్ రెడ్డి!

తెలంగాణా రాష్ట్ర మాజీ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు భాజపా తరపున ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రచారం చేయబోతున్నారు. వారణాసిలో తెలుగువారు చాలా మంది నివసిస్తున్నారు. ఆ ప్రాంతాలలో వారిరువురూ నేటి నుంచి సోమవారం వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. వారిరువురూ హిందీలో కూడా అనర్గళంగా ప్రసంగించగలరు కనుక ఇతర ప్రాంతాలలో కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. 

ఏడూ దశలలో జరుగుతున్న యుపి శాసనసభ ఎన్నికలలో ఇంతవరకు 5 దశల పోలింగ్ పూర్తయింది. మళ్ళీ మార్చి 4న 6వ దశ పోలింగ్ జరుగబోతోంది. ఈసారి ఎన్నికలలో బహుజన్ సమాజ్ వాదీ, భాజపా, సమాజ్ వాదీ-కాంగ్రెస్ పార్టీల కూటమి మద్య ముక్కోణపు పోటీ జరుగుతోంది. 

అన్ని పార్టీల భవిష్యత్ ఈ ఎన్నికల ఫలితలపైనే ఆధారపడి ఉంటుంది కనుక ఏవిధంగానైనా విజయం సాధించేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ చిన్న మార్గాన్ని కూడా ఉపయోగించుకొంటున్నాయి. బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే తెలుగువారైన కిషన్ రెడ్డి, మురళీధర్ రావుల చేత కూడా కాశీలో ఎన్నికల ప్రచారం నిర్వహింపజేస్తున్నారని భావించవచ్చు.