తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం కోసం రూ.50 కోట్లు వ్యయంతో సుమారు 9 ఎకరాలలో ‘ప్రగతి భవన్’ నిర్మించబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా వారివారి నియోజక వర్గాలలో అధికారిక నివాస భవనాలను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఒక్కోటి కోటి రూపాయల వ్యయంతో 500 గజాల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు. ప్రజాప్రతినిధుల నివసించే భవనాలు అంటే అన్ని ఆధునిక హంగులు, సౌకర్యాలు ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు.
రాష్ట్రంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 117 మంది ఉన్నారు. కనుక వీటి నిర్మాణం కొరకు రూ.117 కోట్లు అవసరం ఉంటుంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈ భవనాల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుంది. వీటి నిర్మాణం కోసం తగిన స్థలాలు గుర్తించే బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించబడింది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గంలో ఒక భవనం నిర్మించబడింది. మార్చి 2వ తేదీన దాని ప్రారంభోత్సవం జరుగుతుంది. మిగిలిన భవనాల నిర్మాణం కోసం 2017-18 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయించబడతాయి. ఆరు నెలల వ్యవధిలో ఈ 117 భావనలు నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్దేశించినట్లు తెలుస్తోంది.