రసమయి బాలకిషన్ తెలంగాణా ఉద్యమాల సమయంలో తన పాటలతో ప్రజలను ఉత్తేజపరిచిన అందరిలో ఒకడిగా కలిసి మెలిసి పనిచేసేవారు. కానీ ఆయనకు క్యాబినెట్ హోదాతో సాంస్కృతిక సలహాదారుగా నియమించుకొన్న తరువాత ఆయన తీరులో మార్పు వచ్చింది.
కరీంనగర్ లో బుధవారం జరిగిన డిజి ధన్ మేళాలో కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్ లో తెరాస ఎంపి బి వినోద్ కుమార్ ఫోటో లేకపోవడంతో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై రసమయి చిందులు వేశారు.
అయనను ‘ఏయ్ కలెక్టర్..’ అని సంభోదిస్తూ ‘ఇదేమి పద్ధతి.. ఫ్లెక్సీ బ్యానర్ లో ఎంపిగారి ఫోటో ఎందుకు వేయించలేదు?నీ పద్ధతి బాగోలేదు..మార్చుకోవాలి..జరిగిన పొరపాటుకు సారీ చెప్పు,” అని హెచ్చరించారు. వేదికపైనున్న మంత్రులు, క్రిందన ప్రజల సమక్షంలోనే జిల్లా కలెక్టరును పట్టుకొని రసమయి ఈవిధంగా మాట్లాడుతుంటే అందరూ నివ్వెరపోయి చూస్తుండిపోయారు. కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కూడా ఆగ్రహంతో ‘డోంట్ టాక్” అని ఘాటుగా బదులిచ్చి మళ్ళీ వెంటనే తనను తను నిగ్రహించుకొని కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.
కలెక్టర్ అంటే ఒక జిల్లాను నడిపిస్తున్న అత్యున్నత అధికారి. అటువంటిని వ్యక్తిపట్ల రసమయి అనుచితంగా వ్యవహరించడం చాలా శోచనీయం. అయినా పదవులు, అధికారం సంపాదించుకొన్న తరువాత కూడా ఇంకా ప్రజాప్రతినిధులు తమ ఫోటోలను ఫ్లెక్సీ బ్యానర్లలో చూసుకోవాలనే యావ వదులుకోలేకపోవడం విచిత్రం! అందుకు వారు ప్రోటో కాల్ ఉల్లంఘన జరిగిందంటూ అలగడం, అప్పుడు వారి అనుచరులు ఉచితానుచితాలు మరిచి ఉన్నతాధికారులపై ఈవిధంగా చిందులు వేయడం...అంక క్షమాపణలు చెప్పుకోవడాలు వంటివి అందరినీ నవ్వులపాలు చేస్తున్నాయనే సంగతి గ్రహించడం లేదు.
వేదికపైనున్న ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఈ ఘటనపై స్పందిస్తూ “జరిగిందానికి చింతిస్తున్నాము...ఇక్కడితో ఈ వ్యవహారం మరిచిపోదామని” చెప్పారు. రసమయి చేసిన తప్పుకు ఆయన క్షమాపణలు చెప్పుకోవలసిరావడం కూడా బాధాకరమే కదా.