నేతన్నల వివరాల కోసం సర్వే షురూ

తెలంగాణా పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వారి పూర్తి వివరాలు సేకరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. డి.ఆర్.డి.ఎ., ఐ.కె.పి.లకు చెందిన అధికారులు చేనేత కార్మికుల వివరాలు సేకరించేందుకు సర్వే మొదలుపెట్టారు. 

జోగులంబ జిల్లాలో  70 మందితో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిన్నటి నుంచి సర్వే మొదలుపెట్టారు. వారు జిల్లాలో బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నారాయణపేట, కోయిలకొండ, ధన్వాడ, భట్పూర్, కోస్గి మొదలైన ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్ళి చేనేత కార్మికుల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. 

జిల్లాలో సుమారు 3,000 మంది చేనేత కార్మికులు, మరో 300 మంది ఉన్ని నేత కార్మికులు ఉన్నారు. వారి పూర్తి వివరాలను సేకరించి వారి స్థితిగతుల గురించి సమగ్రమైన సమాచారంతో అధికారులు నివేదికలు రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపిస్తారు. చేనేత కార్మికులున్న అన్ని జిల్లాల నుంచి ఇటువంటి నివేదికలు అందిన తరువాత వాటి ఆధారంగా ప్రభుత్వం పధకాలను, పాలసీని రూపొందించి బడ్జెట్ లో చేర్చుతుంది. చేనేత కార్మికులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ కూడా అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. చేనేత కార్మికులను ఆదుకోవడానికి తెలంగాణా ప్రభుత్వం దృడనిశ్చయంతో ఉందనే సంగతి ఈ తాజా సర్వే దృవీకరిస్తోంది.