తెరాస సర్కార్ కు పొన్నాల సూటి ప్రశ్న

మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ తెరాస చేసిన విమర్శలపై అయన మండిపడ్డారు. ‘తెరాస నేతలు ఆ ఆరోపణలు నిరూపించినట్లయితే శాసనసభ ముందే ఉరేసుకొని చావడానికి సిద్దం’ అని సవాలు విసిరారు. 

తమ ప్రభుత్వం హయంలో పూర్తయిన ప్రాజెక్టులనే రీడిజైనింగ్ పేరుతో వేలకోట్లు ఖర్చు చేస్తూ తెరాస సర్కార్ చాలా బారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతోందని పొన్నాల విమర్శించారు. కాంగ్రెస్ హయంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదనే తెరాస నేతల వాదనను ఆయన గట్టిగా ఖండించడమే కాకుండా, మా “ప్రభుత్వం హయంలో కేవలం రూ.60 కోట్లు ఖర్చు చేసి 22 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తే, మీ ప్రభుత్వం ఈ 33 నెలలలో సుమారు రూ.300 కోట్లు పైగా ఖర్చు చేసి ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించిందో చెప్పాలి?” అని పొన్నాల సవాలు విసిరారు. అవినీతికి పాల్పడుతున్న తెరాస సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తోందని పొన్నాల విమర్శించారు. అసలు ఈ 33 నెలల పాలనలో తెరాస సర్కార్ ఎన్ని హామీలను ఏమేరకు అమలు చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. 

పొన్నాల భూకబ్జాలకు పాల్పడ్డారని తెరాస నేతలు ఆరోపించే బదులు వారి వద్ద నిజంగానే దానికి ఆధారాలు ఉంటే ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయడంలేదు? పైగా దానిని నిరూపించమని పొన్నాల స్వయంగా సవాలు విసురుతున్నప్పుడు ఇంకా ఆలోచించడమెందుకు? 

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం, కేటాయింపులలో కూడా కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకొన్నారని తెరాస నేతలు తరచూ ఆరోపిస్తుంటారు. వారి ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించడమే కాకుండా దమ్ముంటే నిరూపించమని సవాళ్ళు విసురుతుంటారు. అయినా అధికారంలో ఉన్న తెరాస ఎవరిమీద కేసులు నమోదు చేయదు! అప్పుడు ఏమనుకోవాలి? తెరాస చేస్తున్న ఆ ఆరోపణలు అబద్దమనుకోవాలా లేక అవినీతిపరులను చూసీ చూడనట్లు వదిలిపెట్టేస్తోందనుకోవాలా? గ్యాంగ్ స్టర్ నయీం కేసులో చాలా మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు? ఇటువంటివన్నీ ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని గ్రహించడం మంచిది.