కాళేశ్వరానికి పర్యావరణశాఖ బ్రేకులు

తెరాస అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాటిలో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని వివిధ దశలలో ఉన్నాయి. కానీ వీలైనంత త్వరగా ప్రాజెక్టులు నిర్మించాలనే ఆలోచనతో తెరాస సర్కార్ కొంచెం దూకుడుగా వెళుతుండటంతో ఎదురుదెబ్బలు తినక తప్పడటంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వాటిలో ఒకటి.

కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు రైతుల కంటే నేతలకే ఎక్కువ ఉపయోగపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నీటిపారుదల రంగంలో మంచి అవగాహన, ఆసక్తి ఉన్నకారణంగా దానిని రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా రీడిజైనింగ్ చేయించి రూ.80,449 కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దాని ద్వారా రాష్ట్రంలో సుమారు 7.38 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్ళు అందుతాయి. హైదరాబాద్ నగరానికి త్రాగు నీరు కూడా అందించేవిధంగా దానిని నిర్మించతలపెట్టారు.

దానిలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వద్ద తెరాస సర్కార్ బ్యారేజీల నిర్మించడానికి సిద్దం అయ్యింది. వాటి క్రింద సుమారు 2866 హెక్టార్లు అటవీ భూమి ముంపుకు గురవుతుంది. కనుక ఈ ప్రాజెక్టులకు పర్యావరణశాఖ అనుమతులు అవసరం. కానీ అవి పొందకుండానే ముందుకు సాగడంతో పర్యావరణశాఖ బ్రేకులు వేసింది. దానితో తెరాస సర్కార్ హడావుడిగా కేంద్ర జలసంఘానికి దరఖాస్తు చేసుకొంది. జలసంఘం సూత్రప్రాయంగా అనుమతిస్తేనే పర్యావరణశాఖ కూడా అనుమతిస్తుంది.

ఈ నిబందన కొత్తగా ఏర్పాటు చేసింది కాదు ఎప్పటినుంచో ఉన్నదే. కానీ దానిని తెరాస సర్కార్ పట్టించుకోకుండా ముందుకు సాగినందున ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు దాని అనుమతులను తీసుకోబోతోంది కనుక త్వరలోనే కాళేశ్వరం నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి.