నీళ్ళ కోసం అధికారుల కొట్లాట

తెలంగాణా, ఏపి నీటిపారుదల శాఖల అధికారుల నిన్న మళ్ళీ కొట్లాడుకొన్నారు. కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశాల ప్రకారం సాగర్ కుడి కాలువ నుంచి ఏపికి 17 టిఎంసిల నీటిని విడుదల చేసినప్పటికీ, ఇంకా మరో టిఎంసి నీళ్ళు తమకు రావలసి ఉందని అక్కడికి చేరుకొన్న ఏపి అధికారులు వాదించారు. వారితో బాటు కొందరు రైతులు కూడా రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమకు ఒక టిఎంసి నీటిని విడుదల చేయకపోతే బలవంతంగా గేట్లు తెరిచి నీటిని తీసుకోవలసివస్తుందని వారు తెలంగాణా అధికారులను హెచ్చరించారు. కానీ తెలంగాణా అధికారులు అందుకు అంగీకరించకపోవడంతో ఏపి అధికారులు, రైతులు అక్కడే 41వ బ్లాకు వద్ద బైటాయించి ధర్నా చేశారు. 

ఈ సంగతి తెలుసుకొని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్, డీఈ తదితరులు అక్కడికి చేరుకొని ఏపి అధికారులతో చర్చించారు. నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి. మధ్యే మార్గంగా నిన్న రాత్రి వరకు నీటిని విడుదల చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించడంతో ఈ గొడవ తాత్కాలికంగా నిలిచింది. 

గత నాలుగు రోజుల నుంచి ఏపి అధికారులు తమపై అదనపు నీటి విడుదలకు ఒత్తిడి చేస్తున్నారని తెలంగాణా అధికారులు ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డుకు  పిర్యాదు చేశారు. ఏపి అధికారులు కూడా నేడు పిర్యాదు చేయబోతున్నారు. 

వేసవి సమీపిస్తుండటంతో ఇరు రాష్ట్రాలలో పంటలను కాపాడుకోవడానికి నీటి అవసరాలు పెరిగాయి. కానీ సాగర్, శ్రీశైలం జలాశయాలలో నీటి మట్టాలు శరవేగంగా అడుగంటిపొతుండటంతో ఇరు రాష్ట్రాల మద్య నీళ్ళ కోసం గొడవలు నిత్యకృత్యమయ్యాయి. సున్నితమైన ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవలసిన అధికారులే ఈవిధంగా కొట్లాటలకు సిద్దం అవుతుంటే, ఇరు రాష్ట్రాల రైతులు, రాజకీయ పార్టీలు కూడా వారి వెనుక బయలుదేరితే, ఇది ఇంకా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. కనుక ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించుకోవడం అందరికీ మంచిది.