శవరాజకీయాలు అంటే తెలుసుకోవాలంటే ఈరోజు దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెదేపా, వైకాపాల మద్య జరిగిన యుద్దాన్ని చూడవలసిందే.
ఈ ప్రమాదంలో ఆ బస్సు డ్రైవర్ తో సహా 11 మంది మరణించారు. బస్సు డ్రైవర్ కు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేశారు. ఈ సంగతి తెలుసుకొన్న జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొని, వైద్యుల నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగి తీసుకొన్నారు. కానీ మళ్ళీ దానిని వైద్యులకు తిరిగి ఇవ్వకుండా మీడియాకు చూపించబోయారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు అక్కడికి వచ్చి ఆ నివేదికను వైద్యులకు తిరిగి ఇమ్మని జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ జగన్ నిరాకరించడంతో అతని చేతిలో నుంచి ఆ పోస్ట్ మార్టం రిపోర్టును కలెక్టర్ అహ్మద్ బాబు లాక్కొనే ప్రయత్నం చేశారు. దానితో ఇరువురి మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జగన్ ఆగ్రహంతో ఊగిపోతూ కలెక్టరు అతిగా ప్రవర్తిస్తే సెంట్రల్ జైలుకి పంపిస్తానని హెచ్చరించడం విశేషం.
ప్రమాదానికి గురైన బస్సు తెదేపా నేతలు జేసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు చెందింది కనుకనే వైద్యులు, పోలీసులు అందరూ కలిసి ఈ కేసును కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారని జగన్ వాదించారు. అందుకే డ్రైవరుకు పోస్ట్ మార్టం చేయకుండానే శరీరాన్ని ప్యాక్ చేసేశారని వాదించారు. బస్సులో రెండో డ్రైవర్ ఉన్నాడని పోలీసులు చెపుతున్నారే కానీ అతనిని ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. దివాకర్ ట్రావెల్స్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని జగన్ డిమాండ్ చేశారు. అప్పుడే మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా బస్సు యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకొంటుందని జగన్ అన్నారు.
ఈ సమస్యపై జగన్ తెదేపాను ఇబ్బందిపెట్టబోయి దుందుడుకుగా వ్యవహరించి తనే ఇప్పుడు చిక్కులో పడ్డారు. ఆసుపత్రిలోకి ప్రవేశించి వైద్యులను బెదిరించడం, జిల్లా కలెక్టర్ ను సెంట్రల్ జైలుకి పంపిస్తానని హెచ్చరించడం రెండూ చాలా తప్పేనని అర్ధం అవుతోంది. జగన్ అధికారంలో లేనప్పుడే ఈ విధంగా వ్యవహరిస్తుంటే ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి అయితే...అంటూ తెదేపా నేతలు ఎలాగూ విమర్శించకమానరు. అంతేకాదు తెదేపా తలుచుకొంటే వైద్యులను, కలెక్టరును బెదిరించినందుకు జగన్ పై కేసు నమోదు చేసి జైలుకి పంపించగలదు. ఆ అవకాశం జగన్ స్వయంగా దానికి కల్పించారని చెప్పక తప్పదు.