తెలంగాణా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తునందున వాటి కోసం భూసేకరణ అనివార్యం అవుతోంది. కానీ ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని చెపుతూనే మళ్ళీ భూసేకరణ చేయనీయకుండా అడ్డుపడుతుంటారు. రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు నిన్న భువనగిరి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఆ సందర్భంగా మాట్లాడుతూ “కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల విషయంలో ద్వందవైఖరి అవలంభిస్తున్నారు. ఒకవైపు శాసనసభలో ప్రాజెక్టులు ఇంకా ఎప్పుడు కడతారు? అని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంటారు. మళ్ళీ వాళ్ళే భూసేకరణ చేయనీయకుండా కోర్టులలో కేసులు వేసి అడ్డుపడుతుంటారు. ఇంతవరకు వివిద ప్రాజెక్టులపై మొత్తం 29 కేసులు వేశారు. భూసేకరణ చేయకుండా ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మించగలమా? తమ హయంలో అవినీతి తప్ప మరేమీ చేయలేని కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు మా ప్రభుత్వం రైతులకు సాగునీరు, గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే వాటిని కూడా అడ్డుకొంటున్నారు.
మెషిన్ కాకతీయ పధకంతో రాష్ట్రంలో వేలాది గ్రామాలలో చెరువులు నీళ్ళతో కళకళలాడుతున్నాయి. వాటి నుంచి పంటలకు నీళ్ళు అందుతున్నాయి. భూగర్భజలాలు పెరిగాయి. ఈ 30 నెలల్లోనే రాష్ట్రంలో 17 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులను నిలువచేయగల గోదాములు నిర్మించాము. మా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తుంటే వాటికి రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు తగులుతూనే ఉన్నారు. ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని హరీష్ రావు అన్నారు.