రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలకు చెందిన వందలాది వోల్వో బస్సులు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కినప్పుడు స్వర్గంలోకి ప్రవేశించినట్లే అనిపిస్తుంది. అవి రయ్యిరయ్యిమని గాలిలో తేలిపోతూ దూసుకుపోతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అవి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకే చేర్చుతాయో లేదా మద్యలోనే స్వర్గానికి చేర్చుతాయో సదరు బస్సు యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ గ్యారంటీ ఇవ్వవు. ఒకసారి బస్సుకు మంటలు అంటుకొని సజీవంగా కాలిపోవచ్చు లేదా ఏ లోయలోనో చెరువులోనో పడి ప్రాణాలు కోల్పోవచ్చు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరడానికే టికెట్ కొనుకొంటున్నారో లేక నేరుగా స్వర్గానికే టికెట్ కొనుకొంటున్నారో తెలియని పరిస్థితి. ఒకసారి వోల్వోలో కూర్చోన్నాక భూమ్మీద ఇంకా నూకలు మిగిలి ఉంటే ఇంటికి లేకుంటే స్వర్గానికి చేరుకొంటారు.
ప్రమాదం జరిగిన తరువాత అయినా బస్సులో ఎంతమంది ప్రయాణికులున్నారో, వారి పేరు ఊరు చిరునామా వంటి వివరాలు కూడా దొరకవు. కనుక నష్టపరిహారం ఊసే ఉండదు. ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా, ఎంతమంది చనిపోతున్నా వాటికీ ఎవరూ కూడా బాద్యులు కారు. అప్పటికేదో హడావుడి చేసి సరిపెట్టేయడమే తప్ప మళ్ళీ అటువంటి ప్రమాదాలు జరుగకుండా ఆపలేరు. ఇదీ మన ప్రభుత్వాలు, ప్రైవేట్ ట్రావెల్స్ తీరు.
తాజాగా నిన్న ఏపిలో కృష్ణాజిల్లాలో ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 11 మంది చనిపోగా 30 మంది గాయపడ్డారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ముళ్లపాడు వద్ద బ్రిడ్జిపై వెళుతుండగా డివైడర్‌ను ఢీకొని క్రింద పడిపోయింది. ప్రాధమిక సమాచారం ప్రకారం అతివేగం, బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి.
షరా మామూలుగా అందరూ రూల్స్ బుక్కు తీసి చూస్తున్నారు. దాని ప్రకారం 12 గంటల ప్రయాణం తరువాత బస్సు డ్రైవర్ మారాలని ఉంది. కానీ మారలేదని సమాచారం. కనుక కేసు పెట్టడం వగైరా తంతు అంతా నడిచిపోతోంది. దివాకర్ ట్రావెల్స్ సంస్థ తెదేపాకు చెందిన జేసి ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి సోదరులది కనుక బహుశః రాజకీయాలు, విమర్శలు, ఆరోపణలు కూడా వినిపించవచ్చు. కానీ కొన్ని రోజుల తరువాత అన్నీ చల్లారిపోతాయి. మళ్ళీ ప్రమాదం జరిగినప్పుడే హడావుడి జరుగుతుంది. అంతా రోటీన్.. బహుశః ఇంత రోటీన్ గా దేశంలో మరే వ్యవస్థ కూడా నడవదేమో?