రాజకీయ నిరుద్యోగులకు పదవులు

వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న సుమారు లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో నిరుద్యోగ ర్యాలికి పూనుకోవడం వగైరా పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ప్రొఫెసర్ కోదండరామ్, ఆయనకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు రాజకీయ నిరుద్యోగులని అందుకే వారు ధర్నాలు, ర్యాలీలు అంటూ హడావుడి చేస్తున్నారని తెరాస నేతలు విమర్శించడం అందరూ చూశారు. ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేయమని నిరుద్యోగులు కోరుతుంటే, తెరాసలో రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు (నామినేటడ్ పదవులు) కల్పించేందుకు తెరాస సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టడం విశేషం. వారు కూడా నిరుద్యోగులేనని సరిపెట్టుకోవాలేమో? 

సుమారు 4-6,000 మంది తెరాస నేతలు, కార్యకర్తలకు ఈ నామినేటడ్ పదవులు పంచిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కొన్ని కార్పోరేషన్లకు, గ్రంధాలయాలు, మార్కెట్ యార్డులు, దేవాలయాలకు కమిటీలు, డైరెక్టర్లు, సభ్యుల నియామకాలు చేపట్టబోతోంది. దాని కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు నియోజకవర్గాల వారిగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తికాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేటడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రభుత్వోద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వానికి ప్రజలు ఐదేళ్ళ సమయం ఇచ్చారని తెరాస మంత్రులే చెపుతున్నారు కనుక 2019 ఎన్నికల వరకు అది మెల్లగా సాగవచ్చు.