కేంద్రప్రభుత్వ నిధులతో అన్ని రాష్ట్రాలలోను అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నట్లయితే ఎటువంటి సమస్యా ఉండదు. కానీ కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాలలో వేరే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, సహజంగానే ఆ క్రెడిట్ ను రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు స్వంతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తుంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అదే జరుగుతోంది. కేంద్రప్రభుత్వ నిధులతో రెండు రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వాటి స్వంతం కార్యక్రమాలుగా చెప్పుకొంటున్నాయని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణా భాజపా అధికార ప్రతినిధి ఎం.రఘునందన్ రావు నిన్న దుబ్బాక మండలంలో అప్పనపల్లి గ్రామంలో జరిగిన భాజపా సమావేశంలో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం పధకాలకు తెరాస సర్కార్ గులాబీ రంగు పూసి తనవిగా చెప్పుకొంటోంది. ఉదాహరణకి కేంద్రప్రభుత్వం అందిస్తున్న నిధులతో స్వచ్చా భారత్ పధకంలో భాగంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లకు తెరాస సర్కార్ గులాబీ రంగు వేస్తూ వాటికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చినట్లు ప్రజలను మభ్యపెడుతోంది. కానీ కేసీఆర్ స్వయంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రం తెరాస సర్కార్ ఇంతవరకు అమలుచేయలేకపోతోంది. దళితులకు 3ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అన్నీ కబుర్లకే పరిమితం అయ్యాయి. రెండేళ్ళ క్రితం కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి లక్ష ఇళ్ళు మంజూరు చేసింది. కనీసం వాటిని కూడా నిర్మించలేకపోయింది,” అని విమర్శించారు.